నెట్‌ఫ్లిక్స్‌.. అమెజాన్‌లకు పోటీగా ‘అహ’..

తెలుగు చిత్రసీమలో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా అనేక విజయవంతమైన సినిమాలతో సత్తా చాటారు అల్లు అరవింద్‌. ప్రస్తుతం ఆయనకు రెండు సొంత బ్యానర్లతో పాటు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీయన డిజిటల్‌ ప్లాట్‌ఫాం పైకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం సినీ రంగానికి పోటీగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి డిజిటల్‌ మాధ్యమాల్లో పలు రకాల వెబ్‌సిరీస్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో వినోద రంగంలో వీటి వాటానే ఎక్కువగా ఉండబోతున్నట్లు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత అల్లు అరవింద్‌ సైతం ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోకి అడుగువేసేందుకు రెడీ అయ్యారు. అందుకే ప్రముఖ వ్యాపార వేత్తలు మాట్రిక్స్‌ ప్రసాద్, రమేష్‌వర రావు భాగస్వామ్యంతో సొంతంగా ఓ డిజిటల్‌ మీడియాను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘అహ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంపై ఇక నుంచి పలు రకాల వెబ్‌సిరీస్‌లు నిర్మించడమే కాక పలు తెలుగు హిట్‌ చిత్రాలను ప్రసారం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన భవిష్యత్‌ కార్యచరణను రూపొందించే పనిలో ఉన్నారట అల్లు అరవింద్‌. ఇప్పటికే ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌కు పెట్టిన పేరును బట్టి చూస్తుంటే.. ఇది బన్ని పిల్లలు అయాన్, అర్హల పేర్లు మీదుగా పెట్టినట్లు అర్థమవుతోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.