‘వైకుంఠపురం..’ దారిలోనే ‘పింక్‌’

సినిమాను తెరకెక్కించడం గొప్ప కాదు.. దాన్ని ప్రేక్షకులకు చేరువచెయ్యడంలోనే అసలు కష్టముంటుంది. అందుకే చిత్ర ప్రచార పర్వాన్ని పరుగులెత్తించడానికి ఒక్కొక్కరు ఒక్కో పంథాలో ముందుకెళ్తుంటారు. ఈ సంక్రాంతికి తెలుగులో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర విషయంలో త్రివిక్రమ్‌ ఓ సరికొత్త పంథాను ఎంచుకోని లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇంతకీ ఆయన ఎంచుకున్న ఆ మార్గం మరేదో కాదు.. మూడు నెలలు ముందు నుంచే ఒక్కొక్కటిగా పాటలు విడుదల చేయడం. ‘వైకుంఠపురములో..’ చిత్రం సంక్రాంతికి థియేటర్లలోకి రాగా ఇందులోని తొలి గీతం ‘‘సామజవరగమన..’’ ఈ తేదీనికి దాదాపు మూడు నెలలు ముందుగానే ప్రేక్షకులకు చేరువై ఈ సినిమాను అందరి నోళ్లలో నానేలా చేసింది. ఈ స్ట్రాటజీనే చిత్ర విజయంలో చాలా కీలకంగా మారింది. అందుకే ఇప్పుడీ చిత్ర విజయాన్ని స్ఫూర్తిగా తీసుకునే పవన్‌ కల్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌ నుంచి దాదాపు రెండు నెలలు ముందుగానే తొలి పాటను వినిపించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఈ చిత్ర స్వరకర్త తమన్‌ తన ట్వీట్‌ ద్వారా ఈ అంశంపై చిన్న క్లూ కూడా ఇచ్చేశాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పవన్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే ఈ క్రేజ్‌ను మరింత స్థాయికి తీసుకెళ్లాలా ముందుగానే గీతాల్ని విడుదల చేస్తే.. చిత్ర విడుదల సమయానికి ప్రచార భారం చాలా వరకు తగ్గుతుందని దిల్‌రాజు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దాదాపు రెండు నెలల క్రితమే తమన్‌కు త్వరితగతిన పాటలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చేశాడట. ఇప్పటికే ఓ పాట రికార్డింగ్‌ పూర్తయినట్లు సమాచారం అందుతోంది. సినిమాలోని ఈ కీలక పాటను యువ సంచలనం సిద్‌ శ్రీరామ్‌ ఆలపించినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల కాబోయే తొలి పాట ఇదేనని చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికర సమాచారం కూడా బయటకొచ్చింది. ఇందులో ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారని, ప్రస్తుతం పవన్‌కి ఆయనకీ మధ్య కోర్టు సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోన్నట్లు తెలుస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.