ఆ ఎపిసోడ్‌ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది

ఈ సంక్రాంతి సంబరాలను ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో మరింత ప్రత్యేకంగా మార్చారు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి చేసిన ఈ మూడో చిత్రంతో ఈ ఇద్దరూ కలిసి హ్యాట్రిక్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి అని వర్గాల నుంచి చక్కటి ఆదరణ వస్తోంది. ఇక ఈ చిత్ర విశేషాల గురించి ప్రస్తావించాల్సి వస్తే.. అందరూ ముక్త కంఠంతో చెప్తున్నవి త్రివిక్రమ్‌ పదునైన సంభాషణలు, కథను సరికొత్త రీతిలో ట్రీట్‌ చేసిన విధానం.. స్టైలిష్‌ స్టార్‌ స్టైలిష్‌ పెర్ఫార్మెన్స్‌ డ్యాన్సుల గురించే. ఇక వీటితో పాటు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఎపిసోడ్‌ మరొకటి కూడా ఉంది. అదే సెకండాఫ్‌లో వచ్చిన ఆఫీస్‌ రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌ సీన్‌. ఈ సన్నివేశంలో బన్ని వేరే కథానాయకుల పాటలకు స్టెప్పులేయడం థియేటర్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బి,సి సెంటర్లలోనే కాకుండా ఎ సెంటర్లలోనూ ఈ ఎపిసోడ్‌కు అదిరిపోయే ఆదరణ దక్కుతోంది. ఈ సన్నివేశంలో ప్రతినాయకుడు సుశాంత్‌ - పూజా హెగ్డేలతో బలవంతంగా షేర్‌లు రాయించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అకస్మాత్తుగా అక్కడికి సీఈవో హోదాలో అల్లు అర్జున్‌ మాస్‌ స్టైలిష్‌ యాంగిల్‌లో ఎంట్రీ ఇస్తాడు. ఈ నేపథ్యంలో ముందుగా మహేష్‌.. ‘‘వచ్చాడయ్యో సామీ’’ గీతానికి అచ్చు ఆయనలాగే స్టెప్పులేసి ప్రతిఒక్కరినీ అలరించాడు. తర్వాత ఎన్టీఆర్‌ అభిమానులకు ట్రీట్‌ ఇచ్చేలా.. ‘‘ఐ వానా ఫాలో ఫాలో యు’’ పాటకు మెరుపులాంటి స్టెప్పులేశాడు. తర్వాత సీన్‌లో పూజా హెగ్డే తన సీట్‌లో నుంచి వెళ్లిపోతుండగా.. ‘హుషారు’లోని ‘‘ఉండిపోరాదే..’’ గీతాన్ని వినిపించి కుర్రకారును ఫిదా చేశాడు. తర్వాత ‘రేసుగుర్రం’ పాటను రాజశేఖర్‌ మేనరిజంతో స్టెప్పులేయడం థియేటర్లో ఒక్కసారిగా నవ్వులు పూయించింది. తర్వాత సునీల్‌.. పవన్‌ కల్యాణ్‌ పాటకు స్టెప్పులెయ్యవా అని కోరగా బన్ని ‘గబ్బర్‌ సింగ్‌’లోని ‘‘పిల్లా నువ్వులేని జీవితం’’ పాటకు అచ్చు తన మామలాగే స్టెప్పులేసి ఇరగదీశాడు. ఇక చివరగా విలన్‌ను అదిరిపోయే రీతిలో చెంప పగలగొట్టి.. ‘‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’’ అంటూ చిరు పాటకు సునీల్‌తో కలిసి స్టెప్పులేసి ఆ ఎపిసోడ్‌కు అదిరిపోయే రీతిలో ముగింపునిచ్చాడు. ఈ ఎపిసోడ్‌ వస్తున్నంత సేపూ థియేటర్లో సినీ ప్రియులంతా కర్చీల్లో సరిగ్గా కూర్చోలేదంటే అతిశయోక్తి కాదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.