విజయ్‌తో అనన్య ఖరారు.. షూట్‌ షురూ!

విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన ఎవరు నటిస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. ఎప్పటి నుంచో అనుకుంటున్న బాలీవుడ్‌ నాయిక అనన్య పాండేను ఎంపిక చేసింది చిత్ర బృందం. గురువారం.. చిత్రీకరణలో పాల్గొంది అనన్య. ఈమెపై కొన్ని సన్నివేశాలు షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. నాయిక ఎంపికను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. విజయ్‌- పూరి కలయికలో వస్తున్న తొలి చిత్రం అయినప్పటికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రంపై. కథానుసారం ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘పతీ పత్ని ఔర్‌ హో’ చిత్రాల్లో మెరిసిన నాయికే అనన్య. ఈ చిత్రాల్లోని ఆమె నటనకు ఫిలింఫేర్‌ ఉత్తమ నూతన నటి అవార్డులు లభించాయి. పూరి దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్‌జోహర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.