అందుకే ప్రచారంలో ‘నిశ్శబ్దం’గా ఉందట!!

దర్శకులకు సినిమా తెరకెక్కించడం, నాయకానాయికలకు నటించడం ఎంత ఎంత కష్టమో.. దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అంతే కష్టం. ఆ కార్యక్రమం... ఈ వేడుక అంటూ ప్రచారం చేస్తేనే కానీ సినిమా ప్రేక్షకులకు చేరదు. అందుకే ప్రమోషన్స్‌లో శ్రద్ధ తీసుకుంటారు. అలాంటిది ఈ విషయంలో ‘నిశ్శబ్దం’ చిత్ర బృందం కాస్త నెమ్మదిగా ఉందని వినిపిస్తోంది. దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతుంది. జనవరి 31న విడుదల కాబోతుంది. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇంకా 20 రోజులే ఉన్నా ప్రమోషన్స్‌ ప్రారంభించలేదని, వ్యక్తిగత కారణాల వల్ల అనుష్క మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంలేదని వదంతలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై అనుష్క స్పందించింది. ‘నిశ్శబ్దం’ సినిమా అప్‌డేట్‌ తెలుసుకునేందుకు స్వీటీ రెండు రోజుల క్రితం ఓ ప్రైవేటు స్డూడియోకు వచ్చారు. అదే సమయంలో మీడియా ఆమెను ఈ విషయమై అడగ్గా.. ‘ఇంకా సమయం ఉంది. వచ్చే వారం నుంచి ప్రచారంలో పాల్గొంటాన’ని తెలిపారు. అదన్న మాట సంగతి. ఇంకా సమయం ఉండటంతో సంక్రాంతి తర్వాత ప్రచారం షురూ చేయనుంది స్వీటీ.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.