మిల్కీబ్యూటీ ఎందుకు మిస్సయినట్లు??

తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంతో అందులో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు సైతం అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని గడించారు. తాజాగా ఈ చిత్ర బృందమంతా మరోసారి ఒకే వేదికపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ చిత్రాన్ని లండన్‌లో పేరుపొందిన రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. అంతేకాదు అనంతరం ఈ సినిమాకు స్వరాలు సమకూర్చిన కీరివాణి ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత విభావరి కూడా నిర్వహించనున్నారు. ఇప్పుడీ కార్యక్రమానికి హాజరయ్యేందుకే ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి తదితరులంతా లండన్‌ చేరుకున్నారు. తాజాగా వీళ్లందరూ కలిసి ఉన్న ఓ ఫొటో కూడా నెట్టింట్లోకి వచ్చింది. అయితే ఈ ఫొటోల్లో మిల్కీబ్యూటీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వాస్తవానికి తొలి భాగంలో అనుష్క పాత్ర కన్నా తమన్నా పాత్రకే ప్రాధాన్యమెక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడింతటి గొప్ప ప్రదర్శనకు ఆమె హాజరుకాకపోవడం ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఇటు దక్షిణాదిలో అటు ఉత్తరాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకవేళ ఈ చిత్ర షెడ్యూళ్ల కారణంగా ఆమె లండన్‌కు వెళ్లలేకపోయిందా? లేక చిత్ర ప్రదర్శన సమయానికి అక్కడ హాజరు కాబోతుందా? అన్నది వేచి చూడాలి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.