హైదరాబాద్‌ రోడ్లపై.. సాధారణ పౌరుడిలా!!

చిత్రసీమ ప్రముఖులంటే చాలు.. డబ్బుకు డబ్బు... హోదాకు హోదా.. వేటికీ కొదవుండదు. విలాసవంతమైన జీవితం.. సెలబ్రిటీ హోదా.. ఎక్కడికైనా వెళ్లాలంటే కార్లు.. బయట రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాలంటే విమానాలు. ఇలా ఉంటుంది వారి లైఫ్‌ స్టైల్‌. ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్న యువ కథానాయకుడు బెల్లంకొండ జీవితం కూడా మొదటి నుంచీ ఇదే విధంగా సాగింది. తండ్రి బడా నిర్మాత. ప్రస్తుతం తనూ హీరోగా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. విలాసవంతమైన జీవితం గడపడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. కానీ, ఇక్కడున్న ఫొటోలు జాగ్రత్తగా గమనించండి.. మీకు ఆసక్తి కలిగించే కొన్ని అంశాలు కనిపిస్తాయి. ఆయన ఓ సాధారణ పౌరుడిలా బస్సుల్లో, మెట్రో రైల్లో, బైక్‌ మీద ఎక్కడో తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాడు కదా. ఇంతకీ విషయం ఏంటంటే.. బెల్లంకొండకు ఓ మామూలు వ్యక్తిలా హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టాలని కోరిక పుట్టిందట. దీంతో అనుకున్నదే తడవుగా.. ఇలా భాగ్యనగర వీధుల్లో ప్రత్యక్షమైపోయాడు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, బైక్‌పైన సరదాగా నగరమంతా చుట్టేసి ఆ ఫొటోలను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘కొంచెం కొత్తగా హైదరాబాద్‌ వీధుల్లో తిరుగుతూ ఫొటోలు ప్రయత్నించాను. ఇక్కడ పెరిగిన వాడిగా.. ప్రజలు ప్రతిరోజు తమ పనులకు వెü™్లందుకు ఉపయోగించే వివిధ ప్రయాణ సాధనాలను చూశాను’’ అంటూ దానికి ఓ ఆసక్తికర వ్యాఖ్యను కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే ‘సీత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యువ హీరో.. ప్రస్తుతం ‘రాక్షసన్‌’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఆయనకు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా.. జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.