లాక్‌డౌన్‌ గొప్పతనాన్ని చెప్తున్న ‘ఫ్యామిలీ’

కరోనా రోజురోజుకు కోరలు చాస్తూ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు, ప్రముఖులు నడుంబిగించిన సంగతి తెలిసిందే. విరాళాలు అందిస్తూ, మరోవైపు ప్రజల్ని చైతన్యం చేసేందుకు వీడియోలు రూపొందిస్తున్నారు.

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ అనే తారతమ్యం లేకుండా హీరోలు, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు ఉదారంగా సాయమందిస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూసేశారు. దీంతో సినిమా ప్రేక్షకులంతా తమ అభిమాన తారల్ని పెద్ద తెరపై చూసే వీలులేకుండా పోయింది. అందుకే అటు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతూ, ఇటు కార్మికులు, దినసరి కూలీలకు చేతనైన సాయమందించేందుకు 'ఫ్యామిలీ' అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించారు దేశంలోని దిగ్గజ తారాగణం. ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌, రణ్‌వీర్‌, ప్రియాంక చోప్రా, అలియాభట్‌, టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, శివరాజ్‌కుమార్‌, ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, సోనాలీ కులకర్ణిలు నటించి సందడి చేశారు. వీరంతా తమ ఇంట్లో ఉంటూనే ఈ షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం మరో విశేషం.

కథేంటంటే.. అమితాబచ్చన్‌ ఇంట్లో ఉంటూ తన కూలింగ్‌ గ్లాసెస్‌ వెతుకుతుంటాడు. అవి ఎక్కడున్నాయో వెతకాలని రణ్‌వీర్‌, దిల్జీత్‌ దోసంజ్‌ ఇళ్లంతా కలియతిరుగుతారు. ఇంట్లోనే వివిధ పనుల్లో నిమగ్నమైన చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, శివరాజ్‌కుమార్‌, ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ తదితరులను తాము వెతుకుతున్న కూలింగ్‌ గ్లాస్‌ల గురించి ఆరా తీస్తారు. చివరికి ఆ కూలింగ్ గ్లాస్‌లను ప్రియాంక చోప్రా తీసుకెళ్లి అమితాబ్‌ చేతికివ్వడంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ ముగుస్తుంది.
వీడియో చివర్లో కరోనాను కట్టడి చేసేందుకు తమలాగే అంతా ఇళ్లకే పరిమితం కావాలని సందేశమిచ్చారు అమితాబ్‌. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన ఏ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదని తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమంతా ఒక కుటుంబం అని చాటి చెప్పేందుకు ఈ ప్రయోగం చేశామని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్మికులు, దినసరి కూలీలకు తోడ్పాటు కోసం నిధులు సేకరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని, ఇళ్లకే పరిమితమైతే ఈ కరోనా మహమ్మారి కూడా తొలగిపోతుందని అమితాబ్‌ పేర్కొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.