బాధపడి ఏడ్చేలోపే.. ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి!
''‘కేరాఫ్‌ కంచరపాలెం’ థియేటర్‌ నుంచి బయటికి వచ్చాక ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఎలా చెప్పాలి? అని ఆలోచించా. సినిమా అలాంటి ప్రభావం నాపై చూపించింది'' అన్నారు కథానాయకుడు నాని. రానా సమర్పించిన చిత్రమిది. వెంకటేశ్‌ మహా దర్శకుడు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాత. స్వీకర్‌ అగస్థి సంగీతం అందించారు. అందరూ నూతన నటీనటులే. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఇది తప్పక చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. నాని తాజాగా ఈ చిత్రం గురించి ట్వీట్‌ చేశారు. ‘చక్కటి చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’ థియేటర్లలో ఆడుతోంది. దయచేసి ఈ సినిమాను మిస్‌ కాకండి. ఈ చిత్రం గురించి చాలా చెప్పాలి. కానీ ట్వీట్‌, పోస్ట్‌ ద్వారా నా మనసులోని మాటల్ని పూర్తిగా చెప్పలేను’ అంటూ ఆయన వీడియో లింక్‌ను పోస్ట్‌ చేశారు. 

''కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా ప్రత్యేక షో వేస్తున్నాం.. చూస్తారా? అని అడిగారు. నా స్నేహితులు కూడా చూసి బాగుంది అన్నారు. కానీ నాకు డేట్స్‌ కుదరక, పనులు ఉండి వెళ్లలేకపోయాను. సినిమా బాగుంటుంది అని తెలిసే మొన్న వెళ్లా. కానీ చిత్రం నా అంచనాల్ని వందరెట్లు మించి ఉంది. ఎప్పుడో చిన్నతనంలో ‘మాతృదేవోభవ’ లాంటి సినిమాలు చేసినప్పుడు ఏడ్చాం. కొన్ని సందర్భాల్లో సన్నివేశాన్ని చూసినప్పుడు బాధపడి ఏడుస్తుంటాం. కానీ తొలిసారి.. ఈ సినిమా చూస్తున్నప్పుడు బాధపడి ఏడ్చేలోపే, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి అనుభవం నా జీవితంలో నాకు ఎప్పుడూ లేదు. ఇందులోని ఓ పాత్రను నేను చేసుంటే బాగుండు..! అనిపించింది. మళ్లీ.. నేను ఇందులో ఉంటే సినిమా చెడిపోయి ఉండేది అనిపించింది. నేనే కాదు.. తెలిసిన ఏ నటుడు ఉన్నా సినిమా మరోలా ఉండేది. తెలుగుదనాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. తెలుగుదనం అంటే నాకు గుర్తొచ్చే ఒకేఒక్క సినిమా ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఇప్పుడు దాని తర్వాత ‘కేరాఫ్‌ కంచరపాలెం’. మొత్తం చిత్ర బృందం అద్భుతంగా పనిచేశారు...'' అంటూ నాని వీడియోలో పేర్కొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.