సర్‌ప్రైజ్‌ చూపించు.. లేకపోతే చిరు లీక్‌ చేస్తారు!!

కరోనా దెబ్బకు చిత్ర సీమ సైతం మూత పడటంతో ప్రజలకు వినోదం కరవైంది. ఇక చిత్రీకరణలు ఆగిపోవడంతో ఇంటికే పరిమితమైన తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో దగ్గరగా ఉంటున్నారు. ప్రస్తుత సమయంలో తమ వ్యాపకాలు, ఆటపాటల గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ట్విటర్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్‌ చిరంజీవి నెట్టింట చేస్తున్న సందడికైతే కొదవే లేదు. ఈరోజు తన తనయుడు రామ్‌చరణ్‌ జన్మదిన కావడంతో చెర్రికి సంబంధించిన పోస్ట్‌లను షేర్‌ చేస్తూ గడిపేస్తున్న ఆయన.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సర్‌ప్రైజ్‌ విషయంలో జక్కన్నకు కౌంటర్‌లు విసిరారు.


చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకోని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు ఎన్టీఆర్‌ గత రాత్రే తెలియజేశారు. అయితే అది ఉదయం 10 గంటలకే విడుదల కావల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఆ గిఫ్ట్‌పై రాజమౌళి అభిప్రాయం తీసుకుందామని గత రాత్రే దాన్ని ఆయనకు పంపగా.. అది ఆలస్యమైనట్లు ఎన్టీఆర్‌ ట్విటర్‌ వేదికగా చెర్రీకి సారీ చెప్పారు. దానికి చరణ్‌ కూడా సరదాగా స్పందిస్తూ ‘‘ఏంటి ఆయనకు పంపించావా.. ఈరోజుకు వస్తుందా?’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం రంగంలోకి దిగిన చిరంజీవి... జక్కన్న, ఎన్టీఆర్, చరణ్‌లను టార్గెట్‌ చేస్తూ.. ‘‘ఐయామ్‌ వెయిటింగ్‌.. భీమ్‌ ఫర్‌ రామ్‌రాజు’’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన రాజమౌళి.. ‘‘సార్‌.. అంటే.. అది.. కొంచెం.. కొంచెమే.. వాస్తవంగా.. ప్లీజ్‌.. సార్‌’’ అంటూ ఓ సరదా రిప్లై ఇచ్చారు. ఇక ఈ ఆలస్యంపై చిరు - జక్కన్నల సంభాషణలను చూసిన మరో దర్శకుడు కొరటాల శివ అదిరిపోయే స్టైల్‌లో కౌంటర్‌ పేల్చాడు. ‘‘త్వరగా విడుదల చేయండి రాజమౌళి సర్‌. లేదంటే మా ‘ఆచార్య’ టైటిల్‌ను రివీల్‌ చేసేసినట్లు మీ సర్‌ప్రైజ్‌ను కూడా బాస్‌ ముందే రివీల్‌ చేసేస్తారు’’ అని జక్కన్నకు హెచ్చరిక జారీ చేశారు. మొత్తానికి ఉదయం నుంచి నెట్టింట జరుగుతున్న ఈ హంగామా ప్రేక్షకులకు సినిమాకు తగ్గని వినోదాన్ని అందించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.