కరోనా కసరత్తులు

కరోనా సెగ చిత్ర పరిశ్రమకు గట్టిగానే తగులుతోంది. థియేటర్లు మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. సినిమా తారలకు ఇప్పుడు బ్రేక్‌. అలాగని విహారాలకు, షాపింగులకు వెళ్లే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొందరు కుటుంబంతో గడుపుతున్నారు. కొందరు ఇంటి వద్దనే తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి పోయారు. అదాశర్మ, శిల్పాశెట్టిల్లాంటి మరికొందరు కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే బయట జిమ్‌కు వెళ్లాలంటే కరోనా భయం. ఇంట్లో కూర్చొని ఉంటే లావై పోయే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో ఉండే వ్యాయామాలు ఎలా చేయాలో చూపిస్తూ ఆ వీడియోలను పంచుకున్నారు అదా, శిల్ప.


*
సామాజిక మాధ్యమాల్లో వైవిధ్యమైన వీడియోలు, ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది అదా శర్మ. ఇంట్లో ఉంటూనే ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చో ఓ వీడియో ద్వారా చెప్పిందామె. అందులో తన మోకాళ్ల పైవరకూ చీర కట్టుకుని రెండు జిమ్‌ క్లబ్‌బెల్స్‌ స్టిక్కులతో వ్యాయామం చేస్తూ కనిపించింది. దూరం నుంచి ఆమె చేసేదంతా ఓ పిల్లి చూస్తుంటుంది. ఈ వీడియో ఫన్నీగా ఉంటూనే వైవిధ్యంగానూ ఉందంటున్నారు నెటిజన్లు. ‘జిమ్‌లు తెరవలేదు. అయినా ఫర్వాలేదు. కసరత్తు చేయడానికి బోలెడన్ని మార్గాలున్నాయి. ‘ధైర్యంగా ఉండండి..భయపడొద్దు.. పిల్లి కూడా నేను చేసే వ్యాయామాన్ని చూస్తోంది. కానీ దూరంగా ఉంది’ అంటూ పోస్ట్‌ చేసింది అదా శర్మ.


*
శిల్పాశెట్టి ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నిత్యం ఏదో కొత్త రకమైన వ్యాయామాలు చేస్తూనే ఉంటుంది. ఆరోగ్యం, అందం గురించి ఉపయోగకరమైన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటుంటుంది. కరోనా కారణంగా జిమ్‌లకు వెళ్లక పోయినా ఇంట్లో ఉండే కేవలం మేడ మెట్లను ఉపయోగించుకొని వ్యాయాయం ఎలా చేయొచ్చో చేసి చూపించింది శిల్ప. ఓ వీడియోని ట్విటర్‌లో పంచుకుంది. ‘‘ఓ బలమైన కారణంతో జిమ్‌కు వెళ్లలేకపోతున్నారు. ఇంట్లో ఉండే ఆ సమయాన్ని సద్వినియోగం చేయండి. మేడ మెట్లను వాడుకొని కసరత్తులు చేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుకోండి’’ అని ట్వీట్‌ చేసింది శిల్ప.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.