డ్రగ్స్‌ తీసుకుంటే వీడియోను ఎందుకు పోస్ట్ చేస్తా?
‘మేం డ్రగ్స్‌ తీసుకుని ఉంటే వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తానా?’ అని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. ఇటీవల బాలీవుడ్‌ సెలబ్రిటీలు దీపికా పదుకొణె, రణ్‌బీర్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, విక్కీ కౌశల్‌, షాహిద్‌ కపూర్‌, మలైకా అరోరా, షాహిద్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌ తదితరుల కోసం కరణ్‌ తన ఇంటిలో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఉన్న వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.


ఈ వీడియోలో వీరంతా కాస్త విభిన్నంగా పోజిచ్చారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. ‘డ్రగ్స్‌ పార్టీ’ చేసుకున్నారని శిరోమణి అకాళీదళ్‌ ఎమ్మెల్యే మజీందర్‌ సిర్సా ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతూ.. వీడియోను షేర్‌ చేశారని తప్పుపట్టారు. ఈ మేరకు ఓ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ ఉపయోగించారనడానికి వీడియో సాక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సెలబ్రిటీల తీరును వ్యతిరేకిస్తున్నానని ట్వీట్‌ చేశారు. కాగా ఈ వివాదంపై తాజాగా కరణ్‌ స్పందించారు. ఎమ్మెల్యే ఆరోపణల్ని ఖండించారు. డ్రగ్స్‌ తీసుకుని ఉంటే వీడియో ఎందుకు తీస్తానని, తీసినా ఆన్‌లైన్‌లో ఎందుకు షేర్‌ చేస్తానని ప్రశ్నించారు. ‘చిత్ర పరిశ్రమలో ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. వారం మొత్తం విశ్రాంతి లేకుండా శ్రమిస్తుంటారు. కాబట్టి వారాంతంలో కాస్త సంతోషంగా సమయం గడపాలని పార్టీ ఏర్పాటు చేశాను. నేను నిజాయితీగానే ఆ వీడియో తీశా. నిజంగా డ్రగ్స్‌ తీసుకుని ఉన్నట్లయితే నేను ఆ వీడియోను షేర్‌ చేయను కదా. నేను అంత మూర్ఖుడిని కాదు’ అని అన్నారు.


అనంతరం విక్కీ కౌశల్‌ ఎందుకు ముక్కు తడుముకున్నారు? అని ప్రశ్నించగా.. ‘అంటే ముక్కు తడుముకునే స్వేచ్ఛ లేదా?, ఫోన్‌ తీసి జోబులో పెట్టుకునే స్వతంత్రం లేదా?. లైట్‌ వల్ల పడ్డ నీడను కూడా పౌడర్‌ (డ్రగ్‌) అంటారా?. నా తల్లి ఈ వీడియో తీయడానికి ఐదు నిమిషాల ముందు వరకు మాతోనే ఉన్నారు. అందరం కలిసి కబుర్లు చెప్పుకున్నాం. ఓ కుటుంబంలా సమయం గడిపాం. మ్యూజిక్‌ వింటూ, రుచికరమైన ఆహారం తింటూ సంతోషంగా ఉన్నాం. అందరూ అనుకుంటున్నట్లు అక్కడ తప్పులేమీ జరగలేదు. ఈసారి మాపై ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకోను. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ఓ వ్యక్తి ఏదో ఊహించుకుని మా గౌరవం, ఖ్యాతికి భంగం కలిగిస్తే సహించను. ఆధారాలు లేకుండా, ఏదో కల్పించుకుని, నిజం కాని విషయాన్ని.. నిజమని చెప్పి మా పరువుకు నష్టం చేకూర్చడం హాస్యాస్పదం’ అని కరణ్‌ పేర్కొన్నారు.

View this post on Instagram

Saturday night vibes

A post shared by Karan Johar (@karanjohar) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.