సినీ నిర్మాత,దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, తెలుగు సినీ పరిశ్రమకు పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆయన ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. చిత్రపరిశ్రమలో విజయబాపినీడుగా సుపరిచితమైన ఆయన 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. ఏలూరులోని సీఆర్‌ఆర్‌ కళాశాలలో బీఏ వరకు చదివి కొంతకాలం వైద్యారోగ్య శాఖలో పనిచేశారు. గుత్తా బాపినీడు పేరుతో పలు రచనలు చేశారు. మద్రాస్‌లో బొమ్మరిల్లు, విజయ మాస పత్రికలను ప్రారంభించారు.మొత్తం 22 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌ బాబు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇండియన్‌ ఫిల్మ్‌, నీలిమ పత్రికలకు సంపాదకునిగానూ వ్యవహరించారు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలు తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారు.
గురువారం అంత్యక్రియలు
విజయ బాపినీడు అంతక్రియలు గురువారం హైదరాబాద్ మహా ప్రస్థానంలో నిర్వహిస్తారు. అమెరికాలో ఉన్న ఆయన పెద్ద కుమార్తె రావడానికి సమయం పడుతున్న కారణంగా అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.