
‘మెహందీ, ‘ఫరేబ్’ లాంటి చిత్రాలతో అలరించిన బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్. అనారోగ్యంతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య బాధపడుతున్నారు.అతని మెదడులో హెర్పెస్ సంక్రమణ కారణంగా అతను వరుసగా మూడు మూర్ఛకు గురైయ్యారని వార్తలొచ్చాయి. అయితే ఆయన కుటుంబ సభ్యుల దగ్గర వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న నటి పూజాభట్, సోనీ రజ్దానీ ఫరాజ్కి సాయం చేయడానికి ముందుకొచ్చారు. అతనికి అయ్యే ఖర్చుకోసం ప్రజలు తమవంతు సాయం చేయమని కోరారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్, ఫరాజ్‌కు అయ్యే వైద్య ఖర్చులన్నింటిని భరించారు. ఈ విషయాన్ని సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన నటి కాశ్మీరా షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా సల్మాన్ గురించి కాశ్మీరా షా స్పందిస్తూ..‘‘మీరు చాలా గొప్ప వ్యక్తి. ఫరాజ్ వైద్య బిల్లులు చెల్లించినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రసీమలో నేను కలుసుకున్న నిజమైన గొప్పమానవతావాది సల్మాన్‌ఖాన్ అని’’ పేర్కొంది. సల్మాన్‌ఖాన్‌తో కలిసి ‘ దుల్హాన్ హమ్ లే జయెంగే’, ‘కహిన్ ప్యార్ నా హో జాయే’లాంటి చిత్రాల్లో నటించింది. ఫరాజ్ ఖాన్ అలనాటి నటుడు యూసుఫ్ ఖాన్ కుమారుడు. ఈయన అమితాబ్ బచ్చన్ నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ చిత్రంలో నటించారు. 1989 రొమాంటిక్ సంగీత చిత్రం అయిన ‘మైనే ప్యార్ కియా’లో హీరోగా మొదట ఫరాజ్‌ఖాన్ సంతకం చేశారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ముందురోజు ఫరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన స్థానంలో సల్మాన్ ఖాన్ చేరారు. ఇక ఆ చిత్రమే సల్మాన్‌ఖాన్‌కి బాలీవుడ్లో ఎనలేని పేరు తెచ్చింది.