ఓ దిగ్గజాన్ని కోల్పోయాం
ప్రముఖ నటుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు (80) హఠాన్మరణంతో చిత్రసీమ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. రచయితగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో నటుడిగా తెరపై మెరిశారు గొల్లపూడి. వందలాది చిత్రాలకు కథా, మాటల రచయితగా పనిచేయడమే కాక నటుడిగా ఇప్పటి వరకు దాదాపు 290కి పైగా సినిమాల్లో నటించి చిత్ర రంగానికి ఎంతో గొప్ప సేవ చేశారు. ఇప్పుడాయన ఇకలేరన్న నేపథ్యంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళి అర్పిస్తున్నారు..


''ప్రముఖ సీనియర్ నటులు, రచయిత, సంపాదకులు, గొల్లపూడి మారుతీరావు మృతి చెందడం ఎంతో విచారకరం ఆయన ఎంత మంచి నటులో, అంత గొప్ప రచయిత. సామాజిక కోణంలోనే ఆయన రచనలు ఉండేవి. సమాజంలో ఉన్న లోటుపాట్లను, పాలకుల తీరును ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా తన రచనల ద్వారా ,వ్యాఖ్యనాల ద్వారా చెప్పేవారు''

-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి


'' నటుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సంపాదకునిగా గొల్లపూడి సేవలు ప్రశంసనీయం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా''
- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి


''గొల్లపూడి మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, సాహితీలోకానికి తీరని లోటు. నటుడిగా, రచయితగా ఆయన సేవలు ప్రశంసనీయం''
-తెదేపా అధినేత చంద్రబాబునాయుడు


‘‘గొల్లపూడి మారుతీరావు గారి ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. తెలుగు చిత్రసీమకు ఆయన అందించిన సేవలు అసామాన్యమైనవి. ఈరోజు మేం ఓ దిగ్గజాన్ని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’
- మహేష్‌బాబు

‘‘గొల్లపూడి మారుతీరావు గారితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి. చిత్రసీమకు మీరు అందించిన సేవలకు మా ధన్యవాదాలు సర్‌’’
- వరుణ్‌ తేజ్‌

''నాకు ఇష్టమైన నటుల్లో గొల్లపూడి మారుతీరావుగారు ఒకరు. ఆయన మాట్లాడే విధానం. ఆయన నటన కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటాయి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము సర్‌''
- నాని


‘‘ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, మాటల రచయితగా, నటుడిగా అన్ని విభాగాల్లో మేటి అనిపించుకుని, నంది అవార్డ్స్‌ దక్కించుకున్న గొప్ప ఆదర్శ మూర్తి ‘గొల్లపూడి మారుతీరావు’ గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’’
- కోన వెంకట్‌

''గొల్లపూడి మారుతీరావుగారి మృతి ఎంతో విచారం. చిత్ర పరిశ్రమకు మీరు అందించిన సేవలు అమోఘం. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం''
-గోపీ చంద్‌

‘‘మీ మరణం చిత్రసీమకు తీరని లోటు. రచయితగా, నటుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న మీరంటే నాకెంతో ఇష్టం. ఇప్పుడు మీరు మా మధ్య లేరన్న వార్త మమ్మల్ని తీవ్ర వేదనుకు గురి చేస్తోంది’’

- అల్లరి నరేష్‌

‘‘ఆయన రచన.. ఆయన నటన.. ఎప్పటికీ మరువలేము. గొల్లపూడి మారుతీరావు గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’’
- అనిల్‌ రావిపూడి

‘‘హ్యాపీడేస్‌’లో నటించడానికి ముందు ఆయన చేసిన ఓ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశా. నటుడిగా ఆయన నాకిచ్చిన సలహాలు, మార్గదర్శకత్వం ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. మీరు నటించిన గొప్ప చిత్రాలతో మా మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’.
- నిఖిల్‌

''గొల్లపూడి మారుతీరావుగారు ఇకలేరన్న వార్త ఎంతో విచారాన్ని కలిగించింది. విలక్షణ నటుడు అన్న పదానికి ఆయన ఒక ఉదాహరణ. ఆయన ఆత్మకు శాంతి కలగాలి''

-సుధీర్‌బాబు

''రచయితగా, నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు మీరందించిన సేవలు అమోఘం. నటులు, రచయితలు, దర్శకులు అదే విధంగా ప్రజలు ఎవరూ మిమ్మల్ని మర్చిపోలేరు'
- గుణ టీమ్‌ వర్క్స్‌Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.