
అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ 2021 బరిలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ నిలిచింది. ఇదే విషయాన్ని మనదేశానికి చెందిన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఈరోజు ప్రకటించింది. లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ‘జల్లికట్టు’ చిత్రం 2019లో విడుదలైంది. ఇది టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శించారు. అంతేకాదు బుసాన్ అంతర్జాతీయ 24వ చలనచిత్ర వేడుకల్లోనూ ప్రదర్శనకు నోచుకుంది. ఇండియా నుంచి ఆస్కార్ ప్రవేశం కోసం ‘గులాబో సితాబో’, ‘చాలాంగ్’, ‘శికారా’, ‘మూతాన్’, ‘కాలిరా అతితా’లాంటి సినిమా పోటీ పడ్డాయి. చివరకు ఆ అవకాశం ‘జల్లికట్టు’కు దక్కింది. జల్లికట్టు యొక్క ప్రధాన కథానేపథ్యం అంతా ఒక అడవి గేదె చుట్టూ తిరుగుతుంది. చిత్రానికి ఎస్.హారీష్, ఆర్.జయకుమార్ కథను అందించగా ఓ.థామస్ ఫణికర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో నటులుగా ఆంటోనిగా ఆంటోని వర్గీస్, కలాన్ వర్కీగా చెంబన్ వినోద్ జోస్, సోఫీగా శాంతి బాలచంద్రన్, కుట్టాచన్గా సబుమోన్ అబ్దుసమద్లు నటించి మెప్పించారు. ఓపస్ పెంటా సంస్థ నిర్మించిన చిత్రానికి ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మూడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఇరవై కోట్లు ఆర్జించింది.