జపనీయుల అభిమానం
మన సినిమా ఖండాంతరాలు దాటి సత్తా చాటుతోంది. మన తారలకి విదేశాల్లోనూ అభిమాన గణం ఏర్పడుతోంది. ఆయా తారలు చేస్తున్న కొత్త సినిమాల గురించి స్థానిక అభిమానులు ఆసక్తి ప్రదర్శించినట్టుగానే... విదేశాల్లోనూ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ‘బాహుబలి’ చిత్రాలు జపాన్, చైనా తదితర దేశాల్లో పెద్దయెత్తున విడుదలై అక్కడి ప్రేక్షకుల దృష్టిని విశేషంగా అలరించాయి. ఆ చిత్రంతో ప్రభాస్, రానాలకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా జపాన్‌లో ఆ ఇద్దరికీ అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాల గురించి కూడా జపాన్‌ ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ‘మగధీర’తో రామ్‌చరణ్‌కి కూడా జపాన్‌లో అభిమానులు ఏర్పడ్డారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా జపాన్‌ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్‌ కార్డులు, పెయింటింగ్స్, లేఖలు పంపారు. వాటిని అందుకొన్న రామ్‌చరణ్‌ జపాన్‌ అభిమానులకి కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే కలుసుకొంటానని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.


* ఇద్దరు దర్శకులు
రామ్‌చరణ్‌ ప్రస్తుతం ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మరోపక్క నిర్మాతగా ‘సైరా నరసింహారెడ్డి’ చేస్తున్నారు. కొత్తగా ఆయన కోసం ఇద్దరు దర్శకులు కథలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇటీవలే విజయాన్ని అందుకొన్న ఓ యువ దర్శకుడితోపాటు... ప్రస్తుతం ఒక అగ్ర కథానాయకుడితో సినిమా చేస్తున్న మరో దర్శకుడు కూడా త్వరలోనే రామ్‌చరణ్‌కి కథలు వినిపించనున్నట్టు సమాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.