పందెం కోళ్లతో పోటీపడతాడా?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు.. తెలుగు చిత్రసీమకూ పెద్ద పండగ సంక్రాంతే. ఈ ముగ్గుల పండక్కి బాక్సాఫీస్‌ వద్ద కాసులు దండుకొనేందుకు ప్రతిస్టార్‌ హీరో తహతహలాడుతూనే ఉంటాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి అగ్రహీరోలకు సంక్రాంతి అంటే ఓ క్రేజీ సెంటిమెంట్‌. అయితే 2020 సంక్రాంతి మాత్రం టాలీవుడ్‌కు మరింత ప్రత్యేకం కాబోతుంది. ఎందుకంటే ఈసారి ముగ్గుల పండగ బరిలో మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’, బాలకృష్ణ ‘రూలర్‌’ వంటివి పోటీ పడుతున్నాయి. ఇక వీటితో పాటు శేఖర్‌ కమ్ముల - నాగచైతన్యతో చేయబోయే కొత్త చిత్రం, ప్రభాస్‌ - రాధాకృష్ణల కలయికలో రానున్న కొత్త ప్రాజెక్టు సంక్రాంతి బరిలోనే నిలవబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడీ పందెం కోళ్లతో పోటీ పడేందుకు నందమూరి హీరో కూడా రెడీ అయిపోయాడు. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ ఫీల్‌గుడ్‌ చిత్రాన్ని ముగ్గుల పండక్కి తీసుకొస్తే అన్ని విధాల కలిసొచ్చే అవకాశముండటంతో చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. గతంలో వేగేశ్న తెరకెక్కించిన ‘శతమానం భవతి’ సైతం బాలయ్య, చిరు వంటి అగ్రహీరోల సినిమాలతో పోటీ పడి మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ స్ఫూర్తితోనే మహేష్, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలు బరిలో ఉన్నా.. కల్యాణ్‌ రామ్‌తో సాహసం చేయడానికి సిద్ధమయ్యాడు సతీష్‌. మరి ఈ పందెం కోళ్ల పోటీలో నందమూరి హీరో నిలబడతాడో? లేదా? వేచి చూడాలి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.