అచ్చు ‘మిస్సమ్మ’ సావిత్రిలాగే!

అలనాటి అందాల నటి సావిత్రి చేసిన అపురూప చిత్రాల జాబితాలో ‘మిస్మమ్మ’ సినిమాది ప్రత్యేకస్థానం. ఇందులో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ కథానాయకులుగా నటించారు. ఆ రోజుల్లో ‘మిస్సమ్మ’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందులోని పాటలు కూడా అంతే గొప్ప ఆదరణ పొందాయి. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘‘రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా’’ గీతం విశేష ప్రాచుర్యం పొందింది. నేటికీ తెలుగునాట తలచుకునే చక్కని పాటల్లో ఒకటిగా నిలిచింది. అలకపాన్పునెక్కిన తన ప్రేయసి సావిత్రి కోసం కథానాయకుడు ఎన్టీఆర్‌ ఈ పాట పాడగా ఆ సన్నివేశాల్లో సావిత్రి చూపించిన అభినయం, తన కళ్లతో పలికించిన హావభావాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేశన్‌తో రీమేక్‌ చేయగా అందులోనూ సావిత్రే కథానాయికగా నటించింది. ఆ చిత్రంలో కూడా ‘‘రావోయి చందమామ..’’ గీతాన్ని యథాతథంగా రీమేక్‌ చేసి ఆ సన్నివేశాలను తిరిగి తెరకెక్కించారు. అయితే తాజాగా సావిత్రి జీవితగాథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘మహానటి’లో సైతం ఈ గీతాన్ని వెండితెరపై చూపే ప్రయత్నం చేశారు. జెమినీ పాత్రను పోషించిన దుల్కర్‌ సల్మాన్‌, సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్‌తో తమిళ ‘‘రావోయి చందమామా..’’ గీతాన్ని చిత్రీకరించగా దాన్ని చివరి నిమిషంలో సినిమాలో నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ తొలగించిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వైపు నాడు సావిత్రి, జెమినీ గణేశన్లు చేసిన పాటను, మరోవైపు కీర్తి సురేశ్‌, దుల్కర్‌ సల్మాన్‌లు చేసిన పాటను పక్కపక్కగా పెట్టి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. ఈ రెండింటినీ చూస్తుంటే సావిత్రి, జెమినీ గణేశన్‌ల పాత్రల్లో కీర్తి సురేశ్‌, దుల్కర్‌ సల్మాన్‌లు ఎంత చక్కగా ఒదిగిపోయారో అర్థమవుతుంది. ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.