ఉపరాష్ట్రపతి మెచ్చిన ‘మహర్షి'
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.‘కుటుంబసభ్యులతో కలిసి ‘మహర్షి’ సినిమా చూశా. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకుతెచ్చిన సినిమా ‘మహర్షి’. సహజమైన నటన కనబరిచిన కథానాయకుడు మహేశ్‌ బాబుకు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు వంశీ పైడిపల్లికి, నిర్మాతలతో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.విడుదలైన నాలుగు రోజుల్లోనే ‘మహర్షి’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. అమెరికాలో ఇది మహేశ్‌ తొమ్మిదో మిలియన్‌ డాలర్ల చిత్రమని అంటున్నారు. ఆయన నటించిన ‘దూకుడు’, ‘ఆగడు’, ‘శ్రీమంతుడు’, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, నేనొక్కడినే’, ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాలు కూడా మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరాయి. అంతేకాదు టాలీవుడ్‌లో మహేశ్‌ నటించిన ఐదు సినిమాలు (దూకుడు, శ్రీమంతుడు, స్పైడర్‌, భరత్‌ అనే నేను, మహర్షి) రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ ఘనత సాధించిన ఏకైక టాలీవుడ్‌ నటుడు మహేశ్‌ కావడం విశేషం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.