అలాంటి వాళ్లకి దూరంగా ఉండండి

భయపెట్టే, ఆందోళన కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండమని టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కోరారు. కరోనా వైరస్, దాని గురించి వస్తోన్న వార్తలను ఉద్దేశించి ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని విషయాలు సూచించారు. భౌతికదూరం, పరిశుభ్రతతోపాటు మరొకటి పాటించాలని నెటిజన్లను కోరారు. ‘దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటంతోపాటు మరో ముఖ్య విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే భయాన్ని దూరంగా ఉంచడం. ఆందోళన, భయాన్ని కలిగించే వ్యక్తులకు, వార్తలకు దూరంగా ఉండండి. తప్పుడు వార్తలు పెద్ద సమస్యగా మారాయి. తప్పుదారిపట్టించే సమాచారానికి దూరంగా ఉండటం ఉత్తమం. లాక్‌డౌన్‌ విధించి రెండు వారాలు అయింది. మనం చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. ఐకమత్యంగా పనిచేస్తోన్న మన ప్రభుత్వాలను ప్రశంసించాలి. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈ సందర్భంగా మనమంతా ఆరోగ్యంగా ఉండేందుకు కొవిడ్‌-19తో పోరాడుతూ ముందు వరసలో నిల్చున్న వారికి ధన్యవాదాలు చెబుదాం. వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి మన కోసం పోరాడుతున్న యోధులను గౌరవిద్దాం’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.