ఇది అందరికీ కఠిన సమయం..

‘‘ఇది అందరికీ కఠిన సమయం. కానీ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన సమయం కాబట్టి ప్రతిఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి’’ అంటున్నారు కథానాయకుడు మహేష్‌బాబు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలు తమ వంతు బాధ్యతగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్విటర్‌ వేదికగా సూచించారు మహేష్‌. ‘‘ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించండి. ఇది మనకు కఠిన సమయమే అయినప్పటికీ.. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకోని మన సామాజిక జీవితాల్ని త్యాగం చెయ్యాల్సిన అవసరం ఉంది. వీలైనంతరకు ఇంట్లోనే ఉండండి. జన సముదాయాల్లో తిరగకండి. ఇలా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టి ఎన్నో జీవితాల్ని కాపాడుకోవచ్చు. తరచూ చేతుల్ని సబ్బుతో కడుక్కోండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు మహేష్‌. దీంతో పాటు ఓ ఆసక్తికరమైన వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు మహేష్‌. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు ఆయన. ఇప్పుడు పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.