‘బిల్లా రంగా’.. మనోజ్‌, సాయి తేజ్‌

‘బిల్లా రంగా’ పాత్రల్లో మంచు మనోజ్‌, సాయి తేజ్‌ కనిపిస్తే? సినీ ప్రియులకు పండగే. ఒకే స్ర్కీన్‌పై ఈ ఇద్దరి స్టార్లని చూడటం అద్భుతమే. ఈ కాంబినేషన్‌కు మనోజ్‌ సిద్ధంగానే ఉన్నారు. సాయి తేజ్‌ సమాధానం తెలియాల్సి ఉంది. నేడు సాయి తేజ్‌ పుట్టిన రోజు‌. అంతేకాదు 38 ఏళ్ల క్రితం ఇదేరోజున (అక్టోబర్‌ 15) తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘బిల్లా రంగా’ చిత్రం విడుదలైంది. మోహన్‌ బాబు, చిరంజీవి కథానాయకులుగా కె.ఎస్‌.ఆర్‌ దాస్‌ తెరకెక్కించారు. యాక్షన్‌ నేపథ్యంలో టాలీవుడ్‌లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తేజ్‌కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆ సినిమా విశేషాన్ని పంచుకున్నాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తేజ్‌ బాబాయ్‌. మల్టీస్టారర్‌లో బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచిన ‘బిల్లా రంగా’ నేటితో 38ఏళ్లు పూర్తి చేసుకుంది. మన ఇద్దరికి ఇదేదో చెప్తుందని భావిస్తున్నాను. నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా?’ అని సూటిగా అడిగాడు మనోజ్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘ఈ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు మేమూ రెడీ, వేచి చూస్తున్నాం, త్వరగా సెట్‌ చేయండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు, నెటిజన్లు. ‘రంగా బిల్లా’నే రీమేక్‌ చేస్తారా? సరికొత్త కథలో కలిసి నటిస్తారా? అంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం మనోజ్‌ ‘అహం బ్రహ్మాసి’ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి తేజ్‌ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.