చిరు.. నాగ్‌లపై మోదీ ప్రశంసలు


వినోదానికే కాదు.. ఆపద సమయాల్లోనూ అదుకునేందుకు ముందుంటుంది చిత్ర పరిశ్రమ. ప్రస్తుతం దేశంపై కరోనా పంజా విసిరిన ఈ తరుణంలోనూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తూనే.. ప్రజల్లో చైతన్యం నింపేందుకు వినూత్న రీతిలో ముందుకు సాగుతోంది చిత్ర సీమ. ఇందులో భాగంగానే కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కథానాయకులు చిరంజీవి, నాగార్జున, వరుణ్‌ తేజ్, సాయితేజ్‌ ఓ ప్రత్యేక గీతం చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఉయ్‌ గాన్నా ఫైట్‌ కరోనా ఏదేమైనా... చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా... జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్నా... ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా...’’ అంటూ సాగే ఈ గీతంలో కరోనాను నివారించేందుకు ప్రజలు చెయ్యాల్సిన కృషిని, తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా తెలియజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వర సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ గీతం.. ఇటీవలే విడుదలై అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇప్పుడీ పాటపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. కరోనా విషయంలో ప్రజలను చైతన్యం చేసేందుకు చిరు - నాగ్‌ల బృందం చేసిన కృషిని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని తన ట్విటర్‌ ద్వారా అచ్చ తెలుగులో ట్వీట్‌ చేయడం విశేషం.

ఈ పాటపై మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘‘చిరంజీవిగారికీ, నాగార్జున గారికీ, వరణ్‌ తేజ్‌కీ, సాయిధరమ్‌ తేజ్‌కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం ఇళ్లలోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్‌పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona అని రాసుకొచ్చారు ఆయన. మోదీ ప్రశంసపై చిరు ట్విటర్‌ వేదికగా బదులిచ్చారు. ‘‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీ గారు. మన దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి మహాకార్యంలో మేము మా వంతుగా చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి, మా అందరి తరపున మీకు నా ధన్యవాదాలు’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. శ్రీనివాస్‌ మౌళి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని కోటి ఆలపించగా... చిరు, నాగ్, వరణ్, సాయితేజ్‌ ఈ పాటకు ఇంటి వద్దనే అభినయించి ఆ దృశ్యాలను అనుసంధానించడం విశేషం.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.