‘టక్‌ జగదీష్‌’ కోసం ఈ సమయాన్ని అలా!!

కరోనా దెబ్బకు అన్ని సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. అందులో నాని కథానాయకుడిగా నటిస్తోన్న ‘టక్‌ జగదీష్‌’ కూడా ఉంది. ‘నిన్నుకోరి’ వంటి హిట్‌ తర్వాత నాని - శివ నిర్వాణల కలయికలో వస్తోన్న రెండో చిత్రమిది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంతో అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. నిన్నమొన్నటి వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోగా.. కరోనా కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే ఓవైపు షూట్‌ ఆగిపోయినా ఈ విరామ సమయాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకుంటున్నాడట దర్శకుడు శివ. ఈ గ్యాప్‌లో ‘టక్‌ జగదీష్‌’ కోసం అందమైన పాటలను సిద్ధం చేసే పనిలో పడిపోయాడట. ఇందుకోసం ఇప్పటికే తమన్‌ కొన్ని ట్యూన్‌లను సిద్ధం చేసి పెట్టాడని, దానికి తగ్గట్లుగా మంచి సాహిత్యాన్ని సిద్ధం చేసేందుకు శివ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ చిత్రం జులైకి రావల్సి ఉండేది. మరి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది ఎంత ఆలస్యంగా వస్తుందన్నది క్లారిటీ రావల్సి ఉంది. ఇందులో నానికి ఓ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు జోడీగా రీతూ వర్మ, రుహానీ శర్మ కనిపించబోతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.