అమ్మో.. ఈ కత్తులన్నీ నాని ‘వి’లన్‌ కోసమట!!

పాత చిత్రాల్లో ఆయుధాలు అంటే కత్తులు, గొడ్డళ్లు. అదే పౌరాణిక చిత్రమైతే గదలు, బాణాలు దర్శనమిచ్చేవి. అయితే చిత్రసీమలోకి కొత్త దర్శక తరం ఎంట్రీ ఇచ్చాక ఈ ఆయుధాలు సైతం సరికొత్త సొబగులు అద్దుకున్నాయి. ముఖ్యంగా రాజమౌళి చిత్రాల్లో దీన్ని ఎక్కువగా గమనించవచ్చు. ఆయన చిత్రాల్లోని కథానాయకులు వాడే ఆయుధాలు చాలా సరికొత్తగా హీరోయిజాన్ని మరింత ఎలివేట్‌ చేసేలా దర్శనమిస్తుంటాయి. ‘సింహాద్రి’తో జక్కన్న షురూ చేసిన ఈ ట్రెండ్‌ ఆ తర్వాత మిగిలిన దర్శకులకూ వైరస్‌లా అంటుకుంది. త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, కొరటాల శివ వంటి నవతరం దర్శకులంతా హీరోలపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో.. వారు ఉపయోగించే అందే శ్రద్ధ పెడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆయుధాలను డిజైన్‌ చేసి మరీ తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సైతం నాని ‘వి’ కోసం ఇలాంటి ప్రయత్నమే చేశారు. ఈ సినిమా కోసం ఓ చిన్నపాటి కత్తుల కర్మాగారాన్నే సెట్స్‌లో పెట్టేసుకున్నారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తుండగా.. నాని ఓ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లోని ఓ చిన్న వీడియోను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు సుధీర్‌. ఈ వీడియోలో రకరకాల డిజైన్లలో ఉన్న చిన్నపాటి చేతి కత్తులు, విభిన్నమైన గొడ్డళ్లు, వేట కత్తులు ఓ టేబుల్‌పై దర్శనమిచ్చాయి. ఇవన్నీ ‘వి’ కోసం ఇంద్రగంటి ప్రత్యేకంగా సిద్ధం చేయించుకున్నారట. ఇవి ఉపయోగించడానికి చాలా సౌలభ్యంగా ఉండేలా ఉన్నట్లు సుధీర్‌ చెప్పారు. సాధారణంగా ఇంద్రగంటి చిత్రాలు రక్తపాతాలకు దూరంగా, చాలా ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా సాగిపోతుంటాయి. కానీ, ఇప్పుడీ వీడియో చూస్తుంటే ఈసారి తీవ్రస్థాయిలో రక్తపాతం తప్పదేమో అనిపిస్తోంది. మరి ఇవన్నీ నానిలోని విలనిజాన్ని రుచి చూపించడానికే ఉపయోగించనున్నాడా? లేక మరేదైనా విలన్‌ గ్యాంగ్‌ కోసం సిద్ధం చేసుకున్నాడా? తెలియాలంటే ‘వి’ వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ఇది నానికి 25వ చిత్రం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.