‘నీలాంబరి’లా ఉంటూ ‘మహానుభావుడు’ అవ్వాలి!

ప్రపంచాన్ని భయభ్రాంతుల్లో పడేసింది కరోనా వైరస్‌. దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతోంది. ఈ మహమ్మారికి భయపడొద్దు.. అలా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆలోచింపజేసే ఫొటోలు, పాటలు, సంభాషణలతో నెటిజన్లు జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మహానుభావుడు’, ‘నరసింహ’ చిత్రాల్లోని సన్నివేశాలు ప్రస్తుత పరిస్థితులకి అద్దం పడుతున్నాయి. శర్వానంద్‌ కథానాయకుడుగా మారుతి ‘మహానుభావుడు’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో శర్వా అతి శుభ్రత (ఓసీడీ) చూపించే వ్యక్తిగా కనిపిస్తాడు. ప్రేమికుల రోజు నచ్చిన అమ్మాయి పువ్వు ఇచ్చినా గ్లౌజ్‌ వేసుకోవాలి.. శానిటైజర్‌ రాసుకోవాలి అని చెప్పే రకం. పక్కవారితో కొంచెం దూరంగా ఉండే వ్యక్తిత్వం. ప్రస్తుతం కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రజలంతా ఇదే అనుసరిస్తుండటంతో ఈ చిత్రంలోని వీడియోలు చక్కర్లు కొడుతూ సందేశం ఇస్తున్నాయి.


శుభ్రతతో మాత్రమే ఇది సాధ్యం కాదు కాబట్టి వీలైనంత వరకు బృందాలు ఏర్పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకే ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ (ఇంటి నుంచి విధులు నిర్వహించడం) విధానాన్ని అన్ని సంస్థలు ప్రవేశపెట్టాయి. దీంతో ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటున్నారు. ‘నరసింహా’ చిత్రంలో ఇదే పద్ధతిని అనుసరించింది రమ్యకృష్ణ. ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌ తనని వివాహం చేసుకోనని చెప్తాడు. ఎంతగానో ఇష్టపడిన రజనీ ఆ మాట అనడంతో కుటుంబ సభ్యుల్ని కూడా కలవకుండా చాలా కాలం ఒకే గదిలో ఉంటూ నృత్యం అభ్యసిస్తుంది. ఆ సన్నివేశాల్ని గుర్తు చేస్తూ కొన్నాళ్లు నీలాంబరిలా ఉండాలని కోరుతున్నారు నెటిజన్లు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.