విజయ్‌తో ‘అర్జున్‌రెడ్డి 2’.. షారుఖ్‌ని కిడ్నాప్‌!!

‘ఇస్మార్ట్‌’ సుందరి నిధి అగర్వాల్‌ తాను చెయ్యబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్ని ప్రకటించింది. అందులో విజయ్‌ దేవరకొండతో చెయ్యనున్న ‘అర్జున్‌రెడ్డి 2’, తమిళ స్టార్‌ విజయ్‌ దళపతి నటిస్తోన్న 65వ చిత్రం ఉన్నాయి. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె ఈ ఆసక్తికర కబుర్లని పంచుకుంది. అయితే ఇవన్నీ ఆమె చెప్పిన విషయం వాస్తవమే కానీ, ఆ ప్రాజెక్టుల్లో నిజం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆమె తనపై తాను పుట్టించుకున్న ఊహాగాన వార్తలు. ‘ఇప్పటికిప్పుడు మీపై మీరు కొన్ని గాలి వార్తలు సృష్టించుకోమంటే ఎలాంటివి చెప్తారు?’ అని అడిగితే సరదాగా పై విధంగా చెప్పుకొచ్చింది. ఇక ‘హిందీ, తెలుగు, తమిళ చిత్ర సీమల్లో ముగ్గురు కథానాయకుల్ని కిడ్నాప్‌ చెయ్యాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారు?’ అని ప్రశ్నించగా.. హిందీ చిత్రసీమ నుంచి షారుఖ్‌ ఖాన్‌ను కిడ్నాప్‌ చేస్తానని బదులిచ్చింది. వేదికలపై షారుఖ్‌ మాట్లాడే విధానం నాకెంతో నచ్చుతుంది. ఆయన నుంచి ఆ మాట తీరును నేర్చుకోవాలి అనుకుంటున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళ చిత్రసీమల నుంచి మాత్రం ఏ కథానాయకుడినీ కిడ్నాప్‌ చెయ్యలేనంది. ఇక్కడి హీరోలను వాళ్ల అభిమానులు అమితంగా ఆరాధిస్తుంటారు. వాళ్లతో అనవసరమైన గొడవలెందుకు అని చిరునవ్వులు చిందించింది. నటిగా తనని తాను నిరూపించుకునే వైవిధ్యభరిత పాత్రలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని, చక్కటి పీరియాడికల్‌ కథలు దొరికితే చెయ్యాలనుందని తన మదిలోని కోరికలను బయటపెట్టింది నిధి. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో ‘భూమి’ చిత్రంతో పాటు తెలుగులో ఓ సినిమా చేస్తోంది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.