కంగ్రాట్స్‌ బావ.. థ్యాంక్యూ బావ

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ల తర్వాత అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ అందరూ ఊహించినట్లుగానే మంచి ఆదరణను దక్కించుకుంటోంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం చక్కటి వినోదాల విందుతో సినీప్రియులకు రెండు రోజుల ముందుగానే పండగ వాతావరణాన్ని పరిచయం చేసింది. ఇక వసూళ్ల పరంగా చూసినా ఈ చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.30కోట్లకు పైగా షేర్‌ దక్కినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని తొలిరోజే వీక్షించిన జూ.ఎన్టీఆర్‌.. బన్నికి ట్విటర్‌ వేదిక అదిరిపోయే రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా తన ట్వీట్‌లో అల్లు అర్జున్‌ను తారక్‌ బావా అని సంబోధించడం అటు నందమూరి అభిమానుల్ని, ఇటు మెగా అభిమానుల దృష్టినీ ఆకర్షించింది. దీనికి బదులుగా బన్ని సైతం అదే రీతిలో స్పందించారు. ‘‘అల్లు అర్జున్ అద్భుత ప్రదర్శనకు తోడు దర్శకుడు త్రివిక్రమ్ సినిమా బాగా తీశారు. 'అల వైకుంఠపురములో' చిత్రం గొప్ప అనుభూతినిచ్చింది. సహాయ పాత్రలో మురళీశర్మ నటన మెచ్చుకోదగింది. తమన్ సంగీతం చాలా ప్లస్ అయింది. కంగ్రాట్స్​ బావ, స్వామి. శుభాకాంక్షలు’’ అని తొలుత తారక్‌ ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్టైలిష్‌ స్టార్‌ బదులిస్తూ.. ‘‘థ్యాంక్యూ సో మచ్‌ బావ. నీతో ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే కలుద్దాం’’ అంటూ ఆప్యాయంగా ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం వీళ్లిద్దరి సంభాషణలు ట్విటర్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి.
సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.