ఆయన ఇప్పట్లో ఇస్తాడంటావా?

ప్రముఖ తెలుగు నటుడు రామ్‌ చరణ్‌ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర సహనటుడు ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌కి ఓ బహుమతిని ఇస్తానని  చెప్పాడు. కానీ ఎన్టీఆర్‌ తాజాగా..‘‘సారీ బ్రదర్‌ రామ్‌ చరణ్, రాజమౌళి అభిప్రాయాన్ని తెలుసుకుందామని నీ బహుమతిని, నేను నిన్న రాత్రే ఆయనకి పంపాను. ఇక జక్కన్న దగ్గరకి వెళ్తే అది ఎంత ఆలస్యంగా వస్తుందో నీకు తెలుసు కదా? అని’’ ట్వట్టర్లో పేర్కొన్నాడు. ఈ సమాధానంపై స్పందించిన రామ్‌ చరణ్‌..‘‘ఏంటి ఆయన దగ్గరకి పంపించావా..ఇక ఈరోజుకి వస్తుందా?..’’అంటూ తనదైన రీతిలో ట్విట్‌ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో  భారీ ఎత్తున నిర్మితమౌతున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఇందులో బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్, అలియా భట్‌ నటిస్తున్నారు. అలియా రామ్‌ చరణ్‌ సరసన నటిస్తుంది. ఇక ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.