‘మన్మథుడు 2’ నుంచి మరో టీజర్‌

‘మన్మథుడు’ వచ్చిన 16 ఏళ్ల తర్వాత.. మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేసేందుకు ‘మన్మథుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అక్కినేని నాగార్జున. యువ దర్శక,నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తుండగా.. సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఆరు పదుల వయసుకు దగ్గరలో ఉన్నా.. ఇంకా నవ మన్మథుడిలా నాగ్‌ కనిపిస్తున్న తీరు, ముద్దుగుమ్మలతో ఆయన చేసిన ఘాటైన రొమాంటిక్‌ సన్నివేశాలు సినీప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడీ చిత్రం నుంచి మరో టీజర్‌ కూడా రాబోతుందట. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గురువారం విడుదలైన టీజర్‌లో ఎక్కడా రకుల్‌ప్రీత్‌కు సంబంధించిన సన్నివేశాలు చూపించలేదు. కనీసం ఆమెకు సంబంధించిన ఒక్క షాట్‌ కూడా అందులో పెట్టలేదు. ఇది ప్రేక్షకుల్ని ఒకింత నిరాశకు గురిచేసింది. దీనిపై రాహుల్‌ ట్విటర వేదికగా క్లారిటీ ఇస్తూ.. ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. ఈ చిత్రంలో రకుల్‌తో పాటు సామ్, కీర్తి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరు కేవలం అతిథి పాత్రల్లోనే కనిపిస్తారట. చిత్రానికి రకుల్‌ మాత్రమే కథానాయిక అట. ఇక టీజర్‌లో ఆమెను చూపించకపోవడానికి కారణమేంటంటే.. కథానాయికపై ప్రత్యేకంగా టీజర్‌ను రూపొందించడమేనట. అందుకనే ఈ టీజర్‌లో ఎక్కడా ఆమెను చూపించలేదట. త్వరలోనే రకుల్‌కు సంబంధించిన ప్రత్యేక టీజర్‌ ప్రేక్షకుల ముందుకు రానుందట. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.