నెట్టింట వైరల్‌గా పవన్‌ రాబిన్‌హుడ్‌ లుక్‌

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొఘలుల కాలం నాటి ఓ ఆసక్తికర కథాంశంతో పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రంలోని పవన్‌ లుక్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట లీకైంది. ఈ ఫొటోలో పవన్‌ పూర్తిగా కనిపించనప్పటికీ సీరియస్‌ లుక్స్‌తో నుదుటిపై పొడవాటి బొట్టుతో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ చిత్రంలో పవన్‌ రాబిన్‌ హుడ్‌ తరహా దొంగలా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడు బయటకొచ్చిన లుక్‌ను బట్టీ చూస్తే ఆయన పాత్ర దాదాపు అదే కోణంలో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంలా దీన్ని ముస్తాబు చేస్తున్నట్లు సమాచారం. దీని కోసమే మొఘలుల కాలం నాటి వాతావరణాన్ని తలపించేలా హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేక సెట్లను నిర్మించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం పవన్‌ చేస్తోన్న ‘వకీల్‌సాబ్‌’ తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి ‘‘మగువా మగువా’’ గీతాన్ని విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మేలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.