‘సేవ్‌ నల్లమల’.. పవన్‌ వెంటే దేవరకొండ!!

‘సే
వ్ నల్లమల’కు ఉద్యమం క్రమక్రమంగా వేడెక్కుతోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోన్న తరుణంలో పర్యావరణ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తవ్వకాల వల్ల నల్లమలలోని అరుదైన జీవ జాతులు అంతరించడంతో పాటు పర్యావరణం దెబ్బతిని ప్రజల జీవితాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఇటు పర్యావరణ, అటు రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ‘సేవ్‌ నల్లమల్ల’ పేరుతో ఓ ఉద్యమానికి నాంది పలికారు. ప్రస్తుతం దీనికి సినీ ప్రముఖల నుంచి సైతం మద్దతు లభిస్తోంది. నల్లమలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం తక్షణమే యురేనియం తవ్వకాల ప్రక్రియను నిలిపివేయాలని ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, శేఖర్‌ కమ్ముల వంటి వారు ‘సేవ్‌ నల్లమల’పై గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. దీనిపై తాజాగా మరో స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ కూడా స్పందించారు. ‘సేవ్‌ నల్లమల’కు తన మద్దతును ప్రకటిస్తున్నట్లుగా తెలియజేస్తూ.. యురేనియం తవ్వకాల వల్ల జరిగే నష్టాలను ఎత్తి చూపారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 20 వేల ఎకరాల నల్లమల అడవులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేసాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితి కి వచ్చాము. గాలి , నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే సోలార్ ఎనర్జీ ని వినియోగం లోకి తెద్దాం...ప్రతి పై కప్పు పై సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసే చట్టాలు చేద్దాం..స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఎలక్ట్రిసిటీ తో ఏమి చేయాలి...? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం’’ అంటూ ‘సేవ్‌ నల్లమల’పై తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు. ‘‘నల్లమలను కాపాడుకుందాం.. మనకోసం, మన భవిష్యత్ కోసం’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు రౌడీ. ఈ అంశంపై అంతకుముందు పవన్‌ కూడా దాదాపు ఇదే స్టైల్‌లో ఓ లేఖను విడుదల చేయడం విశేషం. ఏదేమైనా ఇలా పవన్‌, దేవరకొండ వంటి స్టార్లంతా ‘సేవ్‌ నల్లమల’కు మద్దతుగా గళం విప్పుతుండటం ఈ ఉద్యమానికి మరింత ఊపు వస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.