తమన్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన పవన్‌

యువ సంగీత దర్శకుడు తమన్‌కు పవన్‌ కల్యాణ్‌ నుంచి ట్విటర్‌ వేదికగా ఊహించని సర్‌ప్రైజ్‌ అందింది. ఇప్పుడిది చూసి ఓ పవన్‌ అభిమానిగా పట్టారాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమన్‌. తాజాగా దీనికి సంబంధించి ట్విటర్‌ వేదిక ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు ఆయన. ఇంతకీ పవన్‌ నుంచి తమన్‌కు అందిన ఆ సర్‌ప్రైజ్‌ ఏంటనే కదా మీ సందేశం.. అక్కడికే వస్తున్నాం. పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో తమన్‌ను ఫాలో చేస్తున్నట్లు రిక్వెస్ట్‌ అందుకున్నారు. తాజాగా తన ట్విటర్‌ నోటిఫికేషన్‌లో పవన్‌ తనని ఫాలో అవుతున్నట్లు చూసిన తమన్‌.. ఆ సంతోషాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పవన్‌ తనని ఫాలో అవుతున్నట్లుగా వచ్చిన నోటిఫికేషన్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘ఓ అభిమానికి అత్యంత ఆనందకరమైన క్షణాలివి. ఈరోజు ఇంత అద్భుతంగా ప్రారంభమవుతుందని అస్సలు ఊహించలేదు సర్‌. మీకు గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. లవ్‌ యు సర్‌’’ అంటూ ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యను జోడించారు తమన్‌. ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘వకీల్‌సాబ్‌’కు స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘‘మగువా మగువా’’ గీతం విడుదల చేయగా.. దానికి నెట్టింట మంచి స్పందన లభిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.