దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెళ్లిసందడి’. 1996లో తెరపైకి వచ్చి ఘన విజయం సాధించింది. శ్రీకాంత్ కథానాయకుడిగా, రవళి, దీప్తి భట్నాకర్ నాయికలుగా చిత్రంలో అలరించారు. ప్రస్తుతం అదే చిత్రానికి సీక్వెల్గా మరో ‘పెళ్లిసందడి’ చిత్రం వస్తోంది. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడు. శ్రీలీల కథానాయిక. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై కె.కృష్ణ మోహనరావు నిర్మిస్తున్న చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుంది. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తుండగా, శివశక్తి దత్తా, చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. అలనాటి పెళ్లిసందడి విడుదలై 25 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా సినిమా గురించి దర్శకుడు రాఘవేంద్రరావు ట్విట్టర్లో చిత్రం గురించి ప్రస్తావిస్తూ..త్వరలోనే థియేటర్లో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెళ్లిసందడి. నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను. ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందడీ సినిమాని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీలతో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం... త్వరలో థియేటర్లో కలుద్దాం.