ప్రభాస్‌ వచ్చాడో లేదో... లక్షల్లో అనుచరులు!

కథానాయకులకీ... అభిమానులకీ వారధిగా నిలుస్తున్నాయి సామాజిక మాధ్యమాలు. అభిమానులు ఏం కోరుకొంటున్నారు? వాళ్లకి ఎలాంటి వినోదం అందించాలనే విషయాల్ని కథానాయకులు సామాజిక మాధ్యమాల్లో వెలువడే అభిప్రాయాలతోనే కనిపెడుతుంటారు. అందుకే తాలరంతా సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ప్రారంభించి అభిమానులకి టచ్‌లో ఉండటంపై ఆసక్తి చూపుతున్నారు. కథానాయకుడు ప్రభాస్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. అయితే ఆయన అలా ఖాతాని ప్రారంభించారో లేదో, ఆ వెంటనే పెద్దయెత్తున అభిమానులు ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టారు. యాక్టర్‌ ప్రభాస్‌ అనే పేరు మాత్రమే రాసి... ప్రొఫైల్‌ ఫొటో, ఇతరత్రా వివరాలేవీ లేకుండా ఖాతాని ప్రారంభించారు. అయినా ఆ ఖాతాని అనుసరిస్తున్న వారి సంఖ్య దాదాపు 7 లక్షలకి చేరింది. ‘బాహుబలి’ చిత్రాలతో ప్రభాస్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఆయన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య పది మిలియన్లకి చేరింది. ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా త్వరలోనే ‘సాహో’కి సంబంధించిన చిత్రాన్ని కానీ, సమాచారాన్ని పంచుకోనున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ ఈ ఆగస్టులో... జాతీయ స్థాయిలో విడుదల కాబోతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.