‘ప్రభాస్‌ 20’కి మళ్లీ బ్రేక్‌.. రాధాకృష్ణ ట్వీట్‌!!

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న 20వ చిత్రానికి మరో బ్రేక్‌ వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అదేంటి సినిమాకు బ్రేక్‌ వస్తే సంతోషమెందుకు? అని అయోమయ పడుతున్నారా!! అదే చెప్పబోతున్నాం. విషయం ఏంటంటే.. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయినట్లు దర్శకుడు స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘తాజాగా మూడవ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. కళా దర్శకుడు రవీందర్‌ రెడ్డి వేసిన ప్రత్యేక సెట్లు.. వాటిని ఎంతో అద్భుతంగా కెమెరాలో బంధించిన మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణం.. ప్రభాస్, పూజా హెగ్డేల కెమెస్ట్రీ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు రాధాకృష్ణ. ప్రస్తుతం ఓ వారం పాటు ప్రభాస్‌ ఇక్కడే విశ్రాంతి తీసుకోనున్నారని, తర్వాత ఫిబ్రవరి 7 నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. 1970ల కాలం నాటి ఓ సరికొత్త పీరియాడికల్‌ ప్రేమకథగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదంతా యూరోప్‌ నేపథ్యంగా సాగుతుంది. అందుకే ఆనాటి అక్కడి నగర వాతావరణానికి తగ్గట్లుగా హైదరాబాద్‌లో దాదాపు 25 ప్రత్యేక సెట్లను నిర్మించింది చిత్ర బృందం. మరో రెండు నెలల పాటు ఈ సెట్లలోనే కీలక షెడ్యూళ్లను చిత్రీకరించనున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.