సినీ కార్మికులకు అండగా ప్రభాస్‌

ప్రభాస్‌ తన దాతృత్వపు హృదయంతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవలే కరోనా నివారణ చర్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.4కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన కరోనా కారణంగా ఉపాధి కరవైన తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికులు, పేద కళాకారుల కోసం ముందడుగు వేశారు. వీళ్లందరి సంరక్షణ కోసం చిరంజీవి ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన ‘సీసీసీ (కరోనా క్రైసిస్‌ ఛారిటీ) - మన కోసం)కు రూ.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు ప్రభాస్‌. ఈ మేరకు తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి ఆయన అందించిన ఈ సాయంతో కరోనా చర్యల కోసం డార్లింగ్‌ ప్రకటించిన విరాళం రూ.4.50కోట్లకు చేరుకున్నట్లయింది. ప్రస్తుతం ప్రభాస్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇటీవలే జార్జియాలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఓ వైవిధ్యమైన పీరియాడికల్‌ ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. దీని కోసం ‘రాధేశ్యాం’, ‘ఓ డియర్‌’ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.