రజనీకాంత్‌ స్టైల్‌ను అనుకరించిన బేర్‌ గ్రిల్స్
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్టైల్‌ను కాపీ కొట్టాలని సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌ తిప్పలుపడ్డారు. వీరిద్దరు కలిసి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో రజనీ స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకోవడం చూసిన బేర్‌ గ్రిల్స్‌ తను కూడా అలా పెట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆయన వల్ల కాకపోవడంతో రజనీ సాయం తీసుకున్నారు. రజనీ ఇలా చేయాలని చెప్పినా.. ఫలితం లేకపోయింది. చివరికి ఆయనే స్వయంగా కళ్లజోడు పట్టుకుని తన స్టైల్‌ను నేర్పించారు. 'అందుకే నువ్వు సినిమా స్టార్‌..' అని వీడియోలో బేర్‌ గ్రిల్స్‌ రజనీని మెచ్చుకున్నారు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది.

డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' షోలో రజనీ కనిపించారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన షో ప్రసారమైంది. ఈ షో కోసం రజనీ కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు. రజనీ తొలిసారి బుల్లితెరపై కనిపించిన షో కావడంతో అభిమానుల్లో ఆసక్తినెలకొంది. 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' షోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కూడా భాగస్వామ్యం అయ్యారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.