
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలోనే రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తపై ఓ స్పష్టత వచ్చింది. ఎన్నో యేళ్లుగా రాజకీయరంగలోకి ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్న చూపులకు ముగింపు పలకనున్నాడు తలైవా. వచ్చే సంవత్సరం జనవరిలోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. ఇదే విషయాన్ని రజనీకాంత్ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. వచ్చే జనవరిలోనే రాజకీయ పార్టీని ప్రారంభిస్తాను. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ డిసెంబర్ 31న తెలియజేస్తానంటూ వెల్లడించారు. అంతేకాదు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నీతి నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు అంటూ రజనీకాంత్ అన్నారు. ఇక వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం తమిళనాట కొత్త ఒరవడి సృష్టించనుందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సోమవారం రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులను కలిసిన తలైవా.. తన రాజకీయ ప్రవేశంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పెడితే చోటుచేసుకునే పరిణామాలు, లోటుపాట్లను తెలుసుకున్నారు. అన్నీ పరిశీలించిన తర్వాతనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు.