రాజమౌళి ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌

తెలుగు దర్శకధీరుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొద్దిరోజులుగా తనకు, తన కుటుంబ సభ్యులకు స్వల్పంగా జర్వం ఉందని.. దీంతో కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాజమౌళినే తన ట్విట్టర్లో స్పందించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌‌లో ఉన్నారు. తమ కుటుంబం కరోనా బారిన పడినప్పటికీ ప్రస్తుతం తమకు ఎలాంటి లక్షణాలు లేవని రాజమౌళి పేర్కొన్నారు. అయినా సరే వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. యాంటీ బాడీస్ తమ శరీరంలో వృద్ధి చెందే సమయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అనంతరం తాము పూర్తి స్థాయిలో కోలుకోగానే ప్లాస్మాను దానం చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రముఖులతో పాటు పలువురు నెటిజన్లు కరోనా నుంచి రాజమౌళి కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ..ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన తొలి సినిమా దర్శకుడు రాజమౌళినే. అందుకే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే క్షేమంగా ఉండాలంటూ కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు సూచనలు, జాగ్రత్తలు చేశాయి. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయం ఇంకా తెలియలేదు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమౌతోన్న చిత్రానికి కీరవాణి సంగీతం స్వరాలు అందిస్తుండగా, బాలీవుడ్‌ నటి అలియాభట్‌ కథానాయికగా నటిస్తోంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.