రామ్‌ ‘రెడ్‌’ కష్టాలు చూశారా..

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు రామ్‌. ఈ చిత్రంతో మాస్‌ హీరోగానూ కొత్త అవతారమెత్తి ప్రేక్షకుల్ని మెప్పించారు ఈ ఎనర్జిటిక్‌ హీరో. ఇప్పుడీ ఉత్సాహంలోనే మరింత ‘రెడ్‌’ చిత్రాన్ని పట్టాలెక్కించేశారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ షురూ కానుంది. ఈ నేపథ్యంలో తన పాత్ర కోసం జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టేశారు రామ్‌. 2019 పవర్‌లిఫ్టర్‌ విన్నర్‌ అయిన శ్రీరామ్‌ వెంకటేశన్‌ ఆధ్వర్యంలో జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారాయన. తాజాగా దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిపింగ్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు రామ్‌. ఈ వీడియోలో లిఫ్టింగ్‌ మిషన్‌పై వెంకటేశన్‌ కూర్చోని ఉండగా.. దాన్ని తన కాళ్లతో పైకి లేపుతూ దర్శనమిచ్చారు రామ్‌. దీనికి ఓ ఆసక్తికరమైన కామెంట్‌ను కూడా జత చేశారు ఆయన. ‘‘ఇక్కడ కేవలం బరువులు మాత్రమే ఎత్తట్లేదు.. ప్రేక్షకులు నాపై పెట్టుకున్న అంచనాలను మోస్తున్నా’’ అంటూ ఓ కామెంట్‌ను జత చేశారు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’ చిత్రాల తర్వాత కిషోర్‌ తిరుమల - రామ్‌ల కలయికలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దీన్ని తమిళ హిట్ మూవీ ‘తడం’కు రీమేక్‌గా రూపొందిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.