ప్రతీకారం కోరుకుంటే జీవితం ఆగిపోతుంది


చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసినా తరువాత తనకంటూ ప్రత్యేకతను సంపాదించకున్న నటుడు రామ్‌చరణ్‌. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న రామ్‌చరణ్‌ నటుడిగానే కాకుండా నిర్మాతగాను రాణిస్తున్నాడు. 2018లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం తరువాత రామ్‌చరణ్‌ నటించిన చిత్రాలు ఇప్పటికీ వరకు తెరపైకి రాలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌.ఆర్.‌ఆర్’‌ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆ మధ్య రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ ‘ఆర్.‌ఆర్.‌ఆర్’‌ చిత్రం బృందం విడుదల చేసిన వీడియో ప్రేక్షకులకు తెగనచ్చేసింది. తాజాగా రామ్‌చరణ్‌ తన ట్విట్టర్లో ఓ మంచి మాట చెప్పారు. ‘వినయ విధేయ రామ’ చిత్రంలోని ఫోటోలను ట్వట్టర్లో షేర్‌ చేస్తూ..‘‘హింస లేదా అహింస..మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు..’’అంటూ పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ తన తండ్రి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రం నిర్మిస్తున్నాడు. ఇందులో రామ్‌చరణ్‌ కూడా కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. అంతేకాదు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కూడా రామ్‌చరణ్‌  అతిథి పాత్రలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.