రానా కొత్త లుక్‌.. ఆ సినిమా కోసమేనట!

కోలీవుడ్‌ ఊసరవెల్లులు ఎవరు? అని అడగ్గానే.. ఎవరికైనా విక్రమ్, కమలహాసన్, విజయ్‌ సేతుపతి, సూర్య తదితరుల పేర్లు ఠక్కున గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే పాత్ర కోసం రూపు మార్చుకునే కథానాయకుల జాబితాలో ముందు వరుసలో ఉండే దక్షిణాది ప్రముఖులు వీరే. అక్కడ ఈ ట్రెండ్‌ ఎప్పటి నుంచో ఉన్నదే. మరి టాలీవుడ్‌లో అలాంటి వారెవరున్నారు అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాత్రం దగ్గుబాటి రానానే. ‘బాహుబలి’లో భళ్లాల దేవుడి పాత్ర కోసం భారీ అవతారంతో దర్శనమిచ్చిన రానా.. ఆ వెంటనే ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో చంద్రబాబు పాత్ర కోసం పూర్తిగా సన్నబడి కొత్తలుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఇలా పూర్తయిందో లేదో మళ్లీ తన కొత్త చిత్రం కోసం కొద్దిగా బరువు పెరిగారు రానా. కానీ ఇప్పుడు ‘విరాటపర్వం’ చిత్రం కోసం మళ్లీ సన్నబడి గుబురు గడ్డెంతో స్టైలిష్‌ లుక్‌లోకి మారిపోయారు. కథ రిత్యా ఈ మూవీలో రానా తక్కువ వయసున్న యువకుడిగా కనిపించబోతున్నారట. అందుకే పూర్తిగా బరువు తగ్గి తన తొలి చిత్రం ‘లీడర్‌’ నాటి రోజులను గుర్తుచేస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’తో ఆకట్టుకున్న దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించనున్న రెండో చిత్రమిది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.