రానా - మిహికాల ‘రోకా’ వేడుక

‘ప్రేమించుకుందాం రా’ అంటూ రానా దగ్గుబాటి... మిహీకా బజాజ్‌ కలిసి ఎప్పట్నుంచో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈమధ్యే ‘పెళ్లి చేసుకుందాం’ అనే నిర్ణయానికొచ్చారు. అందుకు పెద్దల అంగీకారం కూడా లభించేసింది. ఇంకేం... దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా... అంటూ బాబాయ్‌ వెంకటేష్‌ పాడుకున్న పాట ఇప్పుడు అబ్బాయ్‌ రానా సొంతమైంది. దక్షిణాదితో పాటు, హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు రానా దగ్గుబాటి... తన మనసుని దోచిన అమ్మాయి మిహీకా బజాన్‌ని పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు బుధవారం హైదరాబాద్‌లో మాట ముచ్చటతో కలిసిపోయాయి.* అబ్బాయ్‌... ఎంగేజ్‌మెంటా?

తెలుగు సంప్రదాయంలో పెళ్లికి ముందు వేడుక అంటే నిశ్చితార్థమే. దగ్గుబాటి వారి ఇంట్లో బుధవారం వేడుక జరిగింది కానీ అది నిశ్చితార్థం కాదు. ఆరా తీస్తే.. అది రోకా వేడుక అని తెలిసింది. రానా ఇంట్లో వేడుక విషయం తెలుసుకున్న నాని కూడా ‘అబ్బాయ్‌... ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా?’ అంటూ వాట్సప్‌ చేశారు రానాకి. ఆయన కాదు, రోకా వేడుక అని బదులిచ్చారు. ఆ వేడుక గురించి ‘గూగుల్‌ చేస్తా’ అంటూ నాని సరదాగా వ్యాఖ్య చేశారు. ఈ సందేశాన్ని రానా దగ్గుబాటి ఇన్‌స్టగ్రామ్‌ స్టేటస్‌ ద్వారా పంచుకున్నారు.


* రోకా వేడుక అంటే...

పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో రోకా ఒకటి. ఉత్తరాది సంప్రదాయంలో ఈ  వేడుకకి ఎంతో ప్రాధాన్యం ఉంది. వధూవరుల కుటుంబాలు కలిసి నిశ్చితార్థం గురించి, పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ వేడుకలో భాగంగానే దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబాలు కలిశాయి. ఈ సందర్భంగా రానా గురువారం ‘మా బంధం ఇక అధికారికం’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకకి సంబంధించిన ఫొటోల్ని పంచుకున్నారు. త్వరలోనే రానా, మిహీకాల నిశ్చితార్థం వేడుకని ఘనంగా జరపనున్నట్టు దగ్గుబాటి కుటుంబ వర్గాలు వెల్లడించాయి. పెళ్లి వేడుకని కూడా ఈ యేడాదిలోనే జరిపేందుకు రానా తండ్రి డి.సురేష్‌బాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.