నిత్యం సవాళ్లతో కూడుకున్న పని మాది: రవీందర్‌

‘‘సహజంగానే మా విభాగానికి నిత్యం సవాళ్లే. వీటికితోడు కరోనా మరిన్ని సవాళ్లని తెచ్చి పెట్టింది. అయినా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం’’ అంటున్నారు ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌. ‘మగధీర’, ‘ఈగ’తోపాటు... గుర్తుండిపోయే ఎన్నో చిత్రాలకి పనిచేశారాయన. ఇటీవల విడుదలైన ‘వి’కి ఆయనే ప్రొడక్షన్‌ డిజైనర్‌. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’తోపాటు వరుణ్‌తేజ్‌ చిత్రం చేస్తున్నారు. ‘రాధేశ్యామ్‌’ కోసం హైదరాబాద్‌లోనే యూరప్‌ నేపథ్యాన్ని ప్రతిబింబించే సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారు. అందులోనే త్వరలో చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఇదివరకు పీరియాడిక్‌ సినిమాలు చాలానే చేశా కానీ, వాటితో పోలిస్తే ‘రాధేశ్యామ్‌’ పూర్తి భిన్నం అంటున్నారు రవీందర్‌. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఈనాడు సినిమా’తో మాట్లాడారు. ‘‘పీరియాడిక్‌ చిత్రం అంటే శతాబ్దాల కిందటి కథేమీ కాదు. 1970 కాలంలో, యూరప్‌ నేపథ్యంలో సాగుతుంది. ఆ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్‌ తీర్చిదిద్దడం కొత్త అనుభవం. కరోనా ప్రభావం వల్ల పరిమిత సంఖ్యలో వర్కర్లని వినియోగిస్తూ, అడుగడుగునా జాగ్రత్తలు పాటిస్తూ చేస్తున్నాం. కరోనా తర్వాత అన్ని విషయాల్లోనూ మరింత క్రమశిక్షణ పెరిగింది. భారీ వ్యయంతో తెరకెక్కే చిత్రాలకి కావల్సినన్ని వనరులు ఉంటాయి. చిన్న చిత్రాలకి మాత్రం అన్నీ అరకొరే. పెద్ద చిత్రాలకి పనిచేసిన అనుభవాన్ని, చిన్న చిత్రాల కోసం వినియోగిస్తుంటాం. ప్రస్తుతం యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాతో ప్రయాణం చేయడమే నాకు ఇష్టం’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.