ఏడేళ్ల శని వదిలిపోయింది
న్యాయం ఆలస్యమై ఉండొచ్చు... కానీ, ఆఖరికి న్యాయం జరిగింది. ఎప్పుడూ ధర్మానిదే అంతిమ విజయమన్న మాట నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుతో మరోమారు నిజమైంది. 2012 డిసెంబరు 16న దిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై పవన్‌ గుప్తా, ముకేశ్‌ సింగ్, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌లతో పాటు మరో ఇద్దరు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె పదిహేను రోజుల పాటు మృత్యువుతో పోరాడి డిసెంబరు 29న సింగపూర్‌ ఆస్పత్రిలో కన్నుమూసింది. అప్పట్లో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ పాశవిక అత్యాచార ఘటనకు పాల్పడిన నలుగురు దోషులకు ఈరోజు ఉరి శిక్ష అమలు కావడంతో దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పలువురు సినీతారలు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతోషం వ్యక్తం చేస్తూ సందేశాలు పోస్ట్‌ చేశారు.


* ‘‘ఇది చాలా గొప్ప వార్త. ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణల తర్వాత ఎట్టకేలకు నిర్భయ దోషుల్ని ఉరి తీశారు. న్యాయం కోసం ఇన్నేళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాడిన నిర్భయ తల్లి ఆశాదేవికి, ఆమె తరపున కేసు వాదించిన న్యాయవాదికి నా వందనాలు’’


- రవితేజ


* ‘‘మొత్తానికి నిర్భయకు న్యాయం జరిగింది. ఇన్నేళ్లకు నిర్భయ తల్లిదండ్రులు ఈరోజు కాస్త ప్రశాంతంగా నిద్రిస్తారనుకుంటున్నా. ఇది వాళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితం. ఆశాదేవికి వందనం’’.


- తాప్సీ

* ‘‘నిర్భయ దోషులను ఉరితీశారు అనే శుభ వార్తలతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. న్యాయం జరిగింది’’.


- తమన్నా

* ‘‘న్యాయం కాస్త ఆలస్యమై ఉండొచ్చు. కానీ, ఆఖరికి అమలైంది. ఆశాదేవి, న్యాయవాది సీమ సమ్రిధికి గౌరవ పూర్వక వందనాలు తెలియజేస్తున్నా’’.


- నాగశౌర్య

* ‘‘సుదీర్ఘ నిరీక్షణల తర్వాత ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగింది. ఇప్పుడు పొల్లాచ్చి కేసులో న్యాయం జరగడానికి ఎంత సమయం పడుతుందోనని అనిపిస్తుంది. ఇప్పటికే ఓ ఏడాది గడిచిపోయింది. వీటి నుంచి నేర్చుకున్న పాఠాలు మర్చిపోకండి. అందరూ జాగ్రత్తగా ఉండండి’’.- కార్తి

* ‘‘ఓ తల్లికి ఉన్నంత బలం మరెవరికీ ఉండదు. ఆశా దేవికి వందనాలు. ఈరోజు ఆడబిడ్డలందరికీ మీరే నిజమైన పోరాట యోధురాలు. ఇన్నేళ్లుగా ఎంతో ధైర్యంగా పోరాటం చేశారు. మొత్తానికి ఈరోజు మా సోదరి నిర్భయకు న్యాయం జరిగింది’’.- సురభి

* ‘‘ధర్మ సంస్థాపనాయ సంభావామి యుగే యుగే’’. ఏడేళ్ల శని వదిలింది. చరిత్రలో నిర్భయ, దిశ మళ్లీ పునరావృతం కాకూడదు’’.

- పివిపి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.