నన్ను ట్రోల్‌ చేయండి.. నాపై మీమ్స్‌ చేయండి!!
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక.. సినీతారలు వారి అభిమానుల మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. నటీనటులు తమ జీవితంలోని ప్రతి ఆనంద క్షణాన్ని సోషల్‌మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తమ అభిమానులు అడిగే ప్రశ్నలకు తమదైన శైలిలో జవాబులిస్తూ వారికెల్లప్పుడూ దగ్గరగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు పొరపాటుగా సినీతారలు చేసే పనులు, మాట్లాడే మాటల వల్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. ఇక మీమ్స్‌తో వారిపై పేలే సెటైర్లకైతే అడ్డు అదుపు ఉండదు. అందుకే సోషల్‌వాల్‌ వేదికగా ఓ మాట మాట్లాడేటప్పుడైనా.. లేక మరే వేదికలపై ముచ్చటించేటప్పుడైనా ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు సినీ ప్రముఖులు. అయితే తాజాగా రెజీనా మాత్రం నెట్టింట్లోని ట్రోలర్స్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తనపై ఇంకా ఇంకా ట్రోల్స్‌ చేయాలని, ఇంకా సరికొత్త మీమ్స్‌ తయారు చేసి పెట్టమని వేడుకుంటోంది. అదేంటి అలా అడిగి మరీ తిట్టించుకోవాల్సిన అవసరమేంటి అనుకోకండి. ఎందుకంటే ప్రస్తుతం తనపై వస్తున్న ట్రోల్స్‌ అన్నీ చాలా సరదాగా ఉంటున్నాయని, ముఖ్యంగా ‘ఎవరు’లోని తన పాత్రతో ఇతరులపై తయారు చేస్తున్న ఫన్నీ మీమ్స్‌ ఎంతో క్రియేటివిటీగా ఉంటున్నాయని సంబరపడిపోతుంది. అంతేకాదు వీటితో నెట్టింట తన క్రేజ్‌ మరింత పెరుగుతోందని, అందుకే ట్రోలర్స్‌ను తనపై మరింత కొత్తగా మీమ్స్‌ తయారు చేసి పెట్టమని వేడుకుంటోంది. ఏదేమైనా ‘ఎవరు’ విజయాన్ని ప్రస్తుతం ఫుల్‌గా ఎంజాయ్‌ చేసేస్తోంది రెజీనా. మరి ఈ సినిమా హిట్‌ ఇచ్చిన కిక్‌తోనైనా రెజీనా ఇకపై తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.