‘ఆర్ఆర్ఆర్’.. సుధీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దాదాపు 50 రోజులుగా సాగుతున్న పోరాట ఘట్టాల చిత్రీకరణ సోమవారం ముగిసింది. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ తదుపరి షెడ్యూల్‌ని విదేశాల్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ రాత్రి వేళలో షూట్ చేసిన దృశ్యాల్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు మొత్తం రాత్రి సమయంలోనే చిత్రీకరించడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజుగా చెర్రీని, కొమురం భీంగా తారక్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ల ఆసక్తిని పెంచుతూ అంచనాలు అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు రాజమౌళి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియా మోరిస్ నాయికలు. అజయ్ దేవగణ్, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.