‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు లీకుల దెబ్బ

తెలుగు చిత్ర పరిశ్రమ దర్శక, నిర్మాతలకు లీకుల వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సెట్లో విషయాలు బయటకు పొక్కకుండా ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ లీకులకు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండే దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సైతం ఈ లీకుల బెడద తప్పట్లేదు. దాదాపు రూ.350 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో అంత్యంత భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించబోతుండగా.. కొమరం భీమ్‌ పాత్రను ఎన్టీఆర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇదిలా ఉండగా.. నెలరోజుల వ్యవధిలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు వీడియోల రూపంలో నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడీ లీకులు చిత్ర బృందాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో తారక్‌ పులితో ఫైట్‌ చేస్తున్న సన్నివేశానికి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది. ఇది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోయే ఎపిసోడ్లలో ఒకటని, ఇటీవలే దీని చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. కానీ, ఎంత పగడ్బందీ చర్యలు తీసుకున్నా.. ఇప్పుడింత కీలక ఎపిసోడ్‌కు సంబంధించిన ఫొటోనే బయటకు రావడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం ఫుల్‌ ఎలర్ట్‌ అయిపోయింది. ఇప్పటికే లీకైన చిత్రాలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం కాపీ రైట్‌ చట్టం ప్రకారం తొలగించారు. కానీ, యూట్యూబ్‌లో మాత్రం ఇప్పటికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన కీలక ఎపిసోడ్‌ సన్నివేశాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ లీకుల బెడద ఎక్కువవుతోన్న నేపథ్యంలో జక్కన్న టీం సెట్లో పనిచేసే వాళ్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోన్నట్లు తెలుస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.